భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) మరో ఘనత సాధించింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో భారత సైన్యం నిఘా వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరినట్లయింది.
India Stratospheric Airship Test 2025: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారతదేశ రక్షణ వ్యవస్థలకి కొత్త అస్త్రం వచ్చి చేరింది. శనివారం భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) నిర్వహించిన స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి పరీక్ష విజయవంతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీతో భారత సైనిక నిఘా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఈ విజయాన్ని భారత రక్షణ రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.
మే3న మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ టెస్ట్ రేంజ్ నుంచి స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగ్రాకు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ను దాదాపు 17 కి.మీ ఎత్తులో పేలోడ్‌తో ప్రయోగించారు. స్ట్రాటో ఆవరణకు చేరుకున్నాక సెన్సార్ల నుంచి డేటా అందింది.
భవిష్యత్తులో భారతదేశం గాలి కంటే తేలికైన హై-ఆల్టిట్యూడ్ వ్యవస్థలను నిర్మించడానికి, ఈ ప్రోటోటైప్ ఫ్లైట్ ఒక మైలురాయి అని DRDO చైర్మన్ సమీర్ కామత్ అన్నారు. స్ట్రాటో ఆవరణ అనేది వాతావరణంలోని వివిధ పొరలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే ఈ సాంకేతిక రంగంలో ప్రావీణ్యం సంపాదించాయి. అధిక ఎత్తులో ప్రయాణించే విమానాల కోసం అధిక నాణ్యత అనుకరణ నమూనాల అభివృద్ధికి దీనిని ఉపయోగిస్తారు. మొత్తం విమాన ప్రయాణ సమయం దాదాపు 62 నిమిషాలు.
స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి పరీక్ష విజయవంతం చేసిన DRDO బృందాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ వ్యవస్థ భారతదేశ భూ పరిశీలన నిఘా సామర్థ్యాలను అద్వితీయంగా పెంచుతుందని, ప్రపంచంలోని ఇటువంటి స్వదేశీ సామర్థ్యాలను కలిగి ఉన్న అతి కొద్ది దేశాలలో మన దేశం ఒకటిగా మారుతుందని ఆయన అన్నారు.
