పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు దీటైన జవాబు ఇవ్వాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ పై దాడికి సన్నాహాలు చేస్తున్న కేంద్రం.. దేశప్రజల్ని అందుకు ముందస్తుగా సిద్దం చేస్తోంది. ఇందుకోసం రేపు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు.
గతంలో 1971లో పాకిస్తాన్ తో యుద్దం సందర్బంగా ఇలాంటి డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ లో భాగంగా దేశంలోని 259 ప్రాంతాల్లో సైరన్ల మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు, హెలికాఫ్టర్ల చక్కర్లు వంటి దృశ్యాలు కనిపించబోతున్నాయి. వీటి ద్వారా పౌరుల్ని రేపు పాకిస్తాన్ తో యుద్దం వస్తే దాన్నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలన్న దానిపై ఆర్మీ ముందుగానే చెప్పబోతోంది. తద్వారా పౌరులకు ముందుగా అవగాహన రానుంది. రేపు జరిగే మాక్ డ్రిల్ కోసం మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో తొలి కేటగిరీలో రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్ లోని సూరత్, వదోడర, కాక్రపార్, మహారాష్ట్రలోని ముంబై, ఉరాన్, తారాపూర్, ఒరిస్సాలోని తాల్చేర్, రాజస్థాన్ లోని కోటా, రావత్ భాటా, తమిళనాడులోని చెన్నై, కల్పక్కం, యూపీలోని బులంద్ షహర్ ఇలా 13 ప్రాంతాల్ని ఎంపిక చేశారు.
రెండో కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వ్యూహాత్మకంగా కీలక నగరాలు అయిన హైదరాబాద్, విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు. వీటితో పాటు మరో 199 ప్రాంతాల్ని ఎంపిక చేశారు. అలాగే మూడో కేటగిరీలో 45 ప్రాంతాలు ఎంపిక చేశారు. ఇలా మొత్తం 259 ప్రాంతాల్లో రేపు డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ట్రాఫిక్, జనసమూహ నిర్వహణతో సహా పౌర విధుల్లో క్రమం తప్పకుండా నిమగ్నమయ్యే చురుకైన స్వచ్ఛంద సేవకుల ఉనికి కలిగి ఉన్నాయి.