దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి
ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు
మెరుగైన వైద్యసౌకర్యాలు అందించాలని, బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు
ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు ప్రకటించిన సీఎం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రుడికి రూ.50వేలు ప్రకటించిన ప్రధాని
ఈ ఘటన మినహా భక్తులకు ఇబ్బందులు లేకుండా సజావుగా దర్శనం కొనసాగేలా చర్యలు
దర్శన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు, ఏప్రిల్ 30 : సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు.
సింహాచలం ఘటనపై మంత్రి మాట్లాడుతూ విశాఖపట్టణం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే విశిష్టమైన నిజరూప దర్శనానికి లక్షలాదిగా భక్తులు విచ్చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం వలన సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన ఏడుగురు భక్తులు మరణించగా, ఒకరు గాయపడినట్లు మంత్రి వెల్లడిరచారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర హోం మంత్రి అనిత గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హుటాహుటిన ఘటన జరిగిన స్థలానికి పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు దర్శనాలు ప్రారంభం కాగా అదే సమయంలో భారీ ఈదురు గాలులతో భారీ వర్షం కురవడం వలన కొండలపై నుంచి భారీగా వర్షం నీరు చేరడంతో ప్రహరీ గోడ కింద ఉన్నటువంటి మట్టి అంతా కరిగి కొత్తగా కట్టినటువంటి ప్రహరీ గోడ పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు మంత్రి చెప్పారు.
అనేక ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాదం స్కీం కింద ఆలయాల అభివృద్ధి నిర్మాణ పనులు చేపడుతుందని, ఒకవైపు శ్రీశైలం, మరోవైపు కనకదుర్గమ్మ ఆలయం కొన్ని అభివృద్ధి పనులు ప్రసాదం స్కీం కింద పూర్తయ్యాయని, సింహాచలంలో కూడా ఆలయ అభివృద్ధి పనులు ప్రసాదం స్కీం కింద ప్రారంభమైనట్లు చెప్పారు. అటు పర్యాటక రంగం, ఇటు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.
సింహాచలంలో జరిగే చందనోత్సవం ప్రభుత్వ పండుగ గుర్తించడం జరిగిందని, దేవాదాయ శాఖ మంత్రిగా తాను, రెవిన్యూ శాఖ మంత్రి, హోం మంత్రి, అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు దాదాపు రెండు నెలల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఘటన జరిగిన తథనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేసి దూరప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు స్వామి వారి దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దర్శనాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతున్నాయని, భక్తుల నుంచి కూడా ఏర్పాట్లపై మంచి స్పందన వస్తుందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు అన్ని సజావుగా సాగాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఒక్క దురదృష్ట ఘటన మినహా అంతా సజావుగా సాగుతుందన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసిందని, సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారని, జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సిఎం ఆదేశించారని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి చెపాపరు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయాలు పాలైన వారికి మూడు లక్షల రూపాయలతో పాటు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు.
సింహాచల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారని, మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేలు పరిహారం ప్రకటించినట్లు మంత్రి చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబాలకు అన్ని విధాల అండగా వుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
మృతుల వివరాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.మృతి చెందిన వారిలో విశాఖపట్నం మధురవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పిల్లా మహేష్, పిల్లా శైలజ దంపతులు, హెచ్ బి కాలనీ విశాఖపట్నం కు చెందిన గుజ్జారి మహాలక్ష్మి, విశాఖపట్నం హెచ్పీ కాలనీ వెంకోజి పాలెం కు చెందిన పైలా వెంకటరత్నం, అంబాజీపేట, మాచవరం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు, అడవివరం సింహాచలం కు చెందిన ఎడ్ల వెంకటరావు, కొర్లపాటి వారి పాలెం, అంబాజీపేట మాచవరం కు చెందిన పత్తి దుర్గా స్వామి నాయుడు గా మంత్రి ప్రకటించారు.