ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే నిందితులుగా తేల్చిన వారిలో కొందరు జైల్లో ఉండగా.. మరికొందరు బెయిల్ పై బయట ఉన్నారు. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కీలకంగా మారింది.
వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే నెలలో ముగియబోతోంది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఆయన ఇవాళ వెల్లడించారు. దీంతో కొత్తగా వచ్చే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై తన అభిప్రాయం అఫిడవిడ్ రూపంలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ఇందులో సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాము దర్యాప్తు జరిపిన నివేదికను జత చేసింది. ఇందులో రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని ఆరోపించింది. అవినాశ్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని తెలిపింది.
మరోవైపు అవినాశ్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని సునీత న్యాయవాది తెలిపారు. కాబట్టి ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి న్యాయవాదులు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ జులై చివరి వారానికి వాయిదా వేసింది.
వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ జులై కి వాయిదా వేసిన సుప్రీం
