ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖపట్నంలో 60 ఎకరాల భూ కేటాయింపు వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. విశాఖ ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని విజయవాడకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు కేశినేని నాని ఆరోపించారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కు భూమి కేటాయించడాన్ని ప్రశంసించారు నాని. ఇది- పలు ఐటీ దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి, వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడానికి, తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు.
అదే సమయంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూముల కేటాయింపు ప్రక్రియను కేశినేని తప్పుపట్టారు. ఈ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయింపుపై విధానంపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఫేస్బుక్ అధికారిక అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ సంస్థ ఏర్పాటైన కొన్ని వారాలకే భారీ ఎత్తున భూమిని కేటాయించడం సహేతుకం కాదని అన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులను అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడని, కాలేజీలో కలిసి చదువున్నారని నాని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.