ఉత్తరాంధ్రకు వర్ష సూచన
ఓవైపు ఎండ…! మరోవైపు వర్షం…! పగలు సెగలు… రాత్రి వాన గుబులు. మధ్యమధ్యలో విరుచుకుపడుతున్న ఈదురుగాలులు… అప్పుడప్పుడు వణుకుపుట్టిస్తున్న వడగళ్లు. అసలీ భిన్న వాతావరణానికి కారణాలేంటి…? ఎండ నుంచి ఉపశమనం పొందేలోపే… వానొచ్చి వణికించడం ఏంటి…? ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఇంతేనా…? వాతావరణశాఖ ఏం చెబుతోంది…? మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది…?
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భీభత్సమైన ఎండలు జనాలను ఉక్కిరిబిక్కి చేస్తుంటే… అంతలోనే వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు ఈదురుగాలుతో కూడిన వడగళ్ల వానలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం మరికొన్ని రోజులపాటు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండలు ఎండలే… వానలు వానలే అని చెబుతున్నారు. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటోంది.