రష్యాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యాలో భారీ భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. వస్తువులు నేలనుపడ్డాయి. 1952 తర్వాత రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన భూకంపం.. అత్యంత శక్తివంతమైన భూకంపం అని అధికారులు పేర్కొన్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో సమీప తీర ప్రాంత ప్రజలను మొత్తం ఖాళీ చేయించారు.ఇక పసిఫిక్ అంతటా నాలుగు మీటర్లు (12 అడుగులు) వరకు సునామీలు సంభవించాయి. సముద్ర అలలు ముందుకొచ్చాయి. దీంతో తీరంలో ఉన్న పడవలు కొట్టుకుపోయాయి. పోర్టులు ధ్వంసం అయ్యాయి. ఇక జాలర్లు పరుగులు పెట్టారు. తీర ప్రాంతం అంతా కోతకు గురైంది. ఇక సునామీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమెరికా, జపాన్, చైనా, న్యూజిలాండ్ దేశాలకు కూడా హెచ్చరికలు వెళ్లాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే రష్యాలో ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం కొందరు మాత్రమే గాయాలు పాలైనట్లుగా సమాచారం అందుతోంది.