రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి యుద్ధభేరి మోగించారు. చంద్రబాబు పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలకు అండగా నిలబడండి:
అవే మీ పనితీరుకు గీటురాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీయే ప్రజలకు అండగా నిలబడాలని జగన్ స్పష్టం చేశారు. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిల్చేది ఎప్పుడైనా మనమేనని, ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా ఉండే చరిత్ర వైయస్ఆర్‌సీపీకే ఉందని ఆయన గుర్తు చేశారు. జిల్లాల్లో మీరు చేపట్టే ప్రజా సంబంధిత కార్యక్రమాలే మీ పనితీరుకు గీటురాయి అవుతాయని, అవి రాష్ట్ర స్థాయి దృష్టిని కూడా ఆకర్షిస్తాయని ఆయన అన్నారు. ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో కలిసి ప్రజా సమస్యలపై స్వయంగా చొరవ తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పార్టీకి మీరే సారధులని, చొరవతో ముందడుగు వేయాలని ఆయన ఉద్ఘాటించారు.
పోరాడే వారికే గుర్తింపు
పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం అత్యంత కీలకమని జగన్ నొక్కి చెప్పారు. ఈ లక్ష్యంతో స్పష్టమైన కాలపరిమితులు నిర్దేశించారు. మే నెలాఖరులోపు మండల కమిటీలు, జూన్-జులై నెలల్లో గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీలు, ఆగస్టు-సెప్టెంబర్-అక్టోబర్‌లో బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమర్థులు, ప్రతిపక్షంలో గట్టిగా పోరాడగల వారిని గుర్తించి, వారికి ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగడానికి ఈ కమిటీల నిర్మాణం అత్యంత కీలకమన్నారు.
‘మీరే పార్టీ.. పార్టీయే మీరు’:
బాధ్యతతో కూడిన అధికారం జిల్లా అధ్యక్షులకు అఖండమైన అధికారాన్ని, అంతే స్థాయిలో బాధ్యతను అప్పగిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. “‘మీ జిల్లాల్లో పార్టీకి మీరే సర్వం. మీరే పార్టీ, పార్టీయే మీరు” అంటూ వారికి అండగా నిలిచారు. బాధ్యత నుంచే అధికారం వస్తుందని, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసి, అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన గురుతర బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీగా కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పనితీరు బాగోలేకపోయినా, పార్టీలో వివాదాలు తలెత్తినా జోక్యం చేసుకుని, సమన్వయం చేసే అధికారం కూడా మీకే ఉంటుందని భరోసా ఇచ్చారు.