మన్ కి బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగం ..
ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ ఉదంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు గుర్తు చేసుకున్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఇది 121వ ఎపిసోడ్. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహిస్తుందనుకుంటే పొరపాటు పడ్డట్టేనని, దీన్ని తుంచివేస్తామని భావోద్వేగంతో ప్రకటించారు.
ఎన్నో సంవత్సరాల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఇప్పుడిప్పుడే నెలకొంటోందని, కాశ్మీరీల రోజువారీ జీవనం కుదుటపడుతోందని అన్నారు. ఉగ్రవాదాన్ని విస్మరించేలా అక్కడ పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ పునరంకితమౌతోందని చెప్పారు. అది- శతృమూకలకు నచ్చలేదని, ఉగ్రవాదులు, వాళ్లను పోషిస్తోన్న యజమానులు.. కాశ్మీర్ వినాశనాన్ని కోరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. అక్కడి ప్రజలు అభివృద్ధి బాట పట్టడాన్ని సహించలేకపోయారని పేర్కొన్నారు. అందుకే- ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. ఉగ్రవాదంపై జరిగే ఈ యుద్ధంలో- దేశ ఐక్యతే మన అతిపెద్ద బలం అని మోదీ చెప్పారు. ఈ సవాలును ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని హృదయ విదారకంగా మార్చిందని, మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోన్నారని అన్నారు.
