“ఆపరేషన్ సింధూర్” తో పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటైన బదులిచ్చింది. బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా.. సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం అందుతోంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.
ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. వారి శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు, ఆయుధ నిల్వలు తుడిచి పెట్టివేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు దాడులు చేపట్టినట్టు స్పష్టం అవుతోంది.
ప్రభుత్వం ప్రకటన తర్వాత ఇండియన్ ఆర్మీ రియాక్ట్ అయ్యింది. న్యాయం జరిగింది అని ఎక్స్‌లో పోస్టు చేసింది. దీంతో ఆపరేషన్ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘భారత్ మాతా కీ జై’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇండియన్ ఆర్మీ ట్వీట్ ని రీ ట్వీట్ చేసి జై హింద్ అని రాసుకొచ్చారు.