విజయవాడ: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
హామీలన్నీ బూటకం..తొలి సంతకమే చిత్తు కాగితం
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారడీ మాటలు చెప్పి,లేనిపోని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని మాజీ మంత్రి రోజా అన్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆమె ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను నట్టేట ముంచారని చెప్పిన ఆమె… ఆయన పెట్టిన మొదటి సంతకం ఓ చిత్తు కాగితంతో సమానమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వారు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అందుకే డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని రోజా ఎద్దేవా చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్..
డర్టీ కేసులు ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ప్రభుత్వం ‘డర్టీ డైవర్షన్ పాలిటిక్స్’ ఆడుతోందని రోజా ఆరోపించారు. “పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి నిజాయితీపరులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ భయపడరని చెప్పిన రోజా… కొందరు పోలీసులు అత్యుత్సాహంతో తప్పులు చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. వారందరినీ భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం శిక్షించి తీరుతామని హెచ్చరించారు.
అమరావతిలో భారీ దోపిడీకి ప్లాన్ చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే ఫైబర్ నెట్,స్కిల్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.స్కిల్ స్కామ్‌లో అక్రమాలు చేసి గతంలో అరెస్ట్ అయిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు.ఆ కేసును ఇప్పుడు ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నించారు.తనపై ఉన్న కేసులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని రోజా సవాల్ విసిరారు.అమరావతి పేరుతో మరో భారీ దోపిడీకి తెరలేపుతున్నారని రోజా ఆరోపించారు.గతంలో రూ.36 వేల కోట్లుగా ఉన్న టెండర్ల అంచనాలను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు ఎలా పెంచారని నిలదీశారు.ఇది ప్రజాధనాన్ని దోచుకోవడం కాదా? అమరావతిలో చంద్రబాబు మనుషులు, ఆయన సామాజిక వర్గం తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా? ఈ అంచనాల పెంపుపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే అన్న మాటలు గుర్తుచేశారు.