పాకిస్థాన్- భారత్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 7న అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచనలు చేసింది.

శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి? లాంటి అంశాలపై ప్రజలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరెన్స్ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సాధారణ ప్రజలు, విద్యార్థులు.. తమను తాము ఎలా రక్షించుకోవాలన్న దానిపై అవగాహన కల్పించనుంది. కేంద్ర హోం శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చనే సంకేతాలు అందుతున్నాయి.

ఇక పాకిస్థాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7.. లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ఇక జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్, జమ్ము కాశ్మీర్ పోలీసులు పహల్గాం తీవ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా గాలింపు చేపట్టారు.
