ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చారిత్రాత్మక వైఫల్యాల కారణంగానే పాకిస్థాన్‌పై యుద్ధం కొనసాగించలేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ వల్లే పీఓకే ఉనికిలో ఉందన్నారు. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం గురించి గుర్తుచేశారు. దేశానికి సంబంధించిన 80 శాతం నదీ జలాలను కాంగ్రెస్ పాకిస్థాన్‌కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం గైర్హాజరవ్వడానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా ఉంది.. కానీ భారతదేశం లేదన్నారు. భారతదేశం తన స్థానాన్ని దక్కించుకోవడానికి మోడీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నెహ్రూ తీసుకున్న చారిత్రక వైఖరే కారణమని స్పష్టం చేశారు. ఇక రాహుల్‌గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం చైనాకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు. డోక్లాంలో మన సైనికుల్ని చైనీయులు వ్యతిరేకంగా నిలబడితే.. రాహుల్‌గాంధీ మాత్రం చైనా రాయబారిని కలిశారన్నారు. చైనా పట్ల అనుకూల వైఖరి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి సోనియా గాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంక్రమించిందని ఆరోపించారు.మాజీ హోంమంత్రి పి. చిదంబరంపై కూడా నిప్పులు చెరిగారు. పరోక్షంగా చిదంబరం పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల పాకిస్థాన్ గుర్తింపుకు సంబంధించిన ఆధారాలను ప్రశ్నించారని.. పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల ఏమి లభిస్తుంది? అని ప్రశ్నించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీలేనని తెలిపారు. మహాదేవ్ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల దగ్గర ఓటరు ఐడీ నంబర్లు ఉన్నాయని… పాకిస్థాన్‌లో తయారైన చాకెట్లు ఉన్నాయని వెల్లడించారు. పహల్గామ్ దాడిలో ఇస్లామాబాద్ హస్తం ఉందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన రుజువు ఏం కావాలని అడిగారు. చిదంబరం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని.. ఇక ముగ్గురు ఉగ్రవాదులు హతం కావడం కూడా విపక్షాలకు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు.