జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో అమాయక పర్యాటకులపై జరిగిన కిరాతక ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ ఘనంగా నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో నమ్మకంతో, ఉల్లాసంగా విహారయాత్రకు వచ్చిన అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు షికారుకు వచ్చినట్లుగా వేటాడారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారి ఐడీ కార్డులు అడిగి, హిందువా, ముస్లింవా అని తెలుసుకుని మరీ అత్యంత క్రూరంగా, కర్కశంగా ప్రాణాలు తీయడం దేశ భద్రతకు సవాల్‌గా మారిందన్నారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనప్పటికీ, తమది జాతీయ విధానమని చెప్పుకొచ్చారు.
ఈ దారుణ దాడిలో కావలికి చెందిన మధుసూదన్ అమరుడైన విషయం తెలిసిందే. మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ పక్షాన రూ. యాభై లక్షల పరిహారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. “‘మనం ఏదో ఒక రూపంలో ప్రాణాలు కోల్పోతాం. అది దేశం కోసం అయితే మన మరణానికి ఒక అర్థం ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మదుసూదన్ కుటుంబం ఆ పరిస్థితి నుంచి బయటపడటం కష్టమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఉగ్రదాడిలో చనిపోయిన అమరవీరులందరికీ జనసేన పక్షాన మరోసారి నివాళులర్పించారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిందని, పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని పవన్ అన్నారు. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరాయుధులపై దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని, అధికారం రాష్ట్రం చేతిలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పవన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నట్లుగా, ఉగ్రవాదులు హత్య చేసి ‘మోదీకి చెప్పుకోండి’ అని అన్నారని పవన్ తెలిపారు.
ఉగ్రవాదులపై ఏమాత్రం కనికరం చూపించవద్దని, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. లక్షలాది మంది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోవడం, అప్పటి నుంచి కశ్మీర్ అశాంతితో రగులుతూనే ఉండటం బాధాకరమన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.
భారత్ గడ్డపై ఉంటూ పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారికి పాకిస్థాన్‌పై ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే మూర్ఖంగా నమ్మరెందుకని ప్రశ్నించారు. అతిమంచితనం, అతి సహనం కూడా ప్రమాదకరమేనని హెచ్చరించారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. పాకిస్థాన్‌ను మనం మూడు సార్లు ఓడించామని గుర్తుచేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యం అవసరమన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని, ఇక్కడ కూడా హిందువులనే టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.