ప్రధాని మోదీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ కీలక భేటీ తాజాగా ఈ ఉగ్ర దాడి ఘటన పైన ప్రతి ఒక్కరు మండిపడుతున్న వేళ ఈ ఘటన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక విషయాలపైన చర్చిస్తున్నారు. నిన్న జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది.
మోడీ నివాసంలో కీలక భేటీలో అమిత్ షా తో పాటు మంత్రులు
ఇప్పటికే నిన్న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడి పరిస్థితులను పరిశీలించి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఆపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అత్యవసర భేటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఉన్నారు.
కాశ్మీర్ ను జల్లెడ పడుతున్న సాయుధ బలగాలు
ఇదిలా ఉంటే 26 మంది టూరిస్టుల ప్రాణాలను హరించిన ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మారణ హోమానికి కారకులైన వారిని పట్టుకోవడానికి, వారిని మట్టు పెట్టడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం వేలాదిమంది సాయుధ పోలీసులు, భద్రతా సిబ్బంది జమ్మూ కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నారు.
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
పలుచోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుందని అమానుషమైన ఈ దాడికి పాల్పడిన వారిని మట్టుపెట్టి బాధితులకు న్యాయం చేయడం కోసం, బలగాలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.