2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయాలు, 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తయారవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో విద్యార్థులు, యువత మీ పాత్ర ఏంటి, మీరు ఏ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారో.. కలలు కనడంతో పాటు వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కొందరు డబ్బుల్లేవని అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపేస్తుంటారు. కానీ మనం సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విట్ యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీల కోసం సోమవారం నాడు వీ లాంచ్‌ప్యాడ్ ను చంద్రబాబు ప్రారంభించారు.
జీవితం ఎలా ఉండాలని చదువుకున్న రోజుల్లో ఆలోచించాను. తనకు ఐఏఎస్ సెట్ అవుతుందని అందరూ సూచించారు. నేను సరిగ్గా చదవలేను. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. గంటల తరబడి చదవడం ఇష్టం ఉండేది కాదు. ఇది నాకు సెట్ కాదని అప్పటి మా వైస్ ఛాన్స్‌లర్‌కు స్పష్టం చేశా. అనుకున్నట్లుగానే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాను. నేను ప్రభుత్వంలోకి వస్తే.. ఐఏఎస్ అధికారులకు దిశా నిర్దేశం చేయవచ్చు అనుకున్నాను. నా జీవితంలో సరిగ్గా అదే జరిగింది. వ్యాపారం, ఉద్యోగం చేయవచ్చు కానీ బతకడం కోసం రాజకీయాలు ఎవరూ చేయవద్దు అనేది నా సూచన. పారదర్శకత, నీతి నిజాయితీ ఉండాలంటే రాజకీయాలను బతుకుదెరువు చేసుకోకూడదు. అందుకే 1991లో సంస్కరణలు వచ్చాయి. 1992లో హెరిటేజ్ సంస్థ స్థాపించా. నా సతీమణి నారా భువనేశ్వరి ఎంతో శ్రమించి సంస్థను అభివృద్ధి చేశారు.
తెలంగాణ నెంబర్ 1తో హ్యాపీ
ఒకప్పుడు తక్కువ సమయంలోనేే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం తెలంగాణలో ఉంది. ఆనాడు నేను తీసుకున్న నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఉన్న కారణంగా దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఓ తెలుగు రాష్ట్రం నెంబర్ వన్ అయినందుకు తెలుగు వాడిగా గర్వపడుతున్నాను. ప్రపంచంలో పలు దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారు. వారు ఎక్కడున్నా అగ్ర స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభం కాబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఐటీ విప్లవం తీసుకొచ్చాం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం చూడవద్దు, కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు.