పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం.
తాజా దాడుల్లో ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. దీనితో పాటు సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు ఛిన్నాభిన్నం అయ్యాయని పేర్కొన్నాయి. వీటి వీడియోలను కూడా విడుదల చేశాయి.
ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఇది అత్యవసర భేటీ. దేశ రాజధానిలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఇది ఏర్పాటైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఎంపీ
– లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇందులో పాల్గొన్నారు. రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సచిన్ పైలెట్, రాజీవ్ శుక్లా, ప్రియాంక గాంధీ వాద్రా, ప్రియాంక చతుర్వేది, తరుణ్ గొగొయ్..సహా పలువురు సభ్యులు దీనికి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు కొనసాగింది. దేశంలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్షున్నంగా చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం దీని వివరాలను మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వెల్లడించారు. తొలుత- భారత ఆర్మీని ప్రశంసించారు. అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేసిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆర్మీ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిందని అన్నారు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను అణచివేశారని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. వారి ధైర్య సాహసాలకు సలాం చెబుతున్నామని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, బారత ఆర్మీ తీసుకున్న ప్రతి చర్యనూ ఏకగ్రీవంగా సమర్థిస్తే వచ్చామని ఖర్గే గుర్తు చేశారు.
ఉగ్రవాదంపై అణచివేయాలంటూ దేశ ప్రజలందరితో కలిసి ముక్తకంఠంతో నినదించామని ఖర్గే పేర్కొన్నారు. భారత సార్వభౌమత్వం, సమైక్యతను కాపాడే విషయంలో ఎలాంటి రాజీపడనక్కర్లేదని, భేదభావాలు అవసరం లేదనివ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత జవాన్లతో భుజం కలిపి నిలిచామని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు అనుసరించిన వ్యూహాలను ఖర్గే ప్రస్తావించారు.
అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. త్రివిధ దళాలకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. వారికి సీడబ్ల్యూసీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తోన్నామని అన్నారు. మచ్ లవ్ టు దెమ్ అని వ్యాఖ్యానించారు. గురువారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. దీనికి సంబంధించిన సమాచారం అందిందని తెలిపారు.