రాత్రికి మోడీతో డిన్నర్..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ డిల్లీ చేరుకున్నారు. సతీమణి ఉషావాన్స్, ముగ్గురు పిల్లలతో పాటు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో దిగిన జేడీ వాన్స్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అల్లుడైన జేడీ వాన్స్ తన నాలుగు రోజుల టూర్ లో భాగంగా దేశంలోని పలు పర్యాటక స్థలాల్ని సందర్శించనున్నారు. అలాగే ఇవాళ రాత్రికి ప్రధాని మోడీతో కలిసి డిన్నర్ చేస్తారు. భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు కూడా జరపనున్నారు.
జైపూర్‌లో జేడీ వాన్స్ కుటుంబం అమెర్ కోటను సందర్శిస్తారు. జైపూర్ పర్యటన తర్వాత వాన్స్ తన కుటుంబంతో కలిసి ఆగ్రాను సందర్శించే అవకాశం ఉంది. అక్కడ వారు తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. జేడీ వాన్స్ భారత పర్యటనలో రెండు దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంపై చర్చించనున్నాయి. ఈ భేటీలో సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపైనా ఇరుదేశాలు చర్చించే అవకాశం ఉంది.