నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.
విజయవంతంగా మిలటరీ ఆపరేషన్ నిర్వహించి అకస్మాత్తుగా కాల్పుల విరమణ జరపడం వెనుక లాజిక్ ఏమిటని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కేంద్రాన్ని నిలదీశారు. పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చే అవకాశాన్ని వదులుకున్నారని, వాళ్లకు ఒక గుణపాఠం చెప్పి ఉండాల్సిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అఖిలేష్ మాట్లాడారు
ముందుగా ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే మన ఆర్మీ ముందంజలో ఉంది. వారి ధైర్యసాహసాలకు అందరం గర్విస్తున్నాం. ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టినప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీనితో పాటు పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. ఛానెల్స్ చూస్తున్నప్పుడు కరాచీ మనది, లాహోర్ మనది, ఇప్పుడు పాక్ కూడా మనదే అనిపించింది. అలాంటి తరుణంలో ప్రభుత్వం ఎందుకు ఆపరేషన్‌ను వెనక్కి లాగిందనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. కాల్పుల విరమణ ప్రకటనకు కారణం ఏమిటి? ప్రభుత్వమే ప్రకటన చేస్తుందని అంతా ఆశించాం. కానీ వాళ్లకున్న లోతైన మిత్రత్వం కారణంగా ప్రభుత్వం వాళ్ల మిత్రుడిని కాల్పుల విరమణ ప్రకటన చేయమని అడిగింది’ అని పరోక్షంగా తానే యుద్ధాన్ని ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని ప్రస్తావించారు.
నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు. ఘటన జరుగుతున్నప్పుడు ఒక్కడు కూడా బాధితులను ఆదుకోవడానికి రాలేదని, 370వ అధికరణ రద్దు తర్వాత ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, పర్యాటకం పెరిగిందని ప్రభుత్వం చెబుతూ వచ్చిందని, ప్రభుత్వాన్ని నమ్మి అక్కడకు వెళ్లారని, అసలు అక్కడ జరిగిన భద్రతా లోపానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు.
నిన్ననే ఎందుకు జరిగింది?
‘ఆపరేషన్ మహదేవ్’ టైమింగ్‌ను కూడా అఖిలేష్ ప్రశ్నించారు. ‘ఉగ్రవాదులు హతమైనందుకు మాకు సంతోషమే. కానీ దీనిని ప్రతిచోటా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది ఎవరు? సపోర్ట్ అవసరమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మీతో కలిసివచ్చాయి. అదలా ఉంచితే, ఎన్‌కౌంటర్ నిన్ననే ఎందుకు జరిగింది? టెక్నాలజీ గురించి మీకు అంతగా తెలిసినప్పుడు పుల్వామాలో ఆర్డీఎక్స్‌ను తీసుకు వెళ్తున్న వాహనాన్ని ఇంతవరకూ ఎందుకు పట్టుకోలేదు? ఇవాల్టికీ బీజేపీ అనుకుంటే పుల్వామాకి ఏ మార్గం గుండా వాహనం వచ్చిందో తెలుసుకోగలదు’ అని అఖిలేష్ అన్నారు.
Related