ప్రియాంకపహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్‌సభలో రెండో రోజు (మంగళవారం) జరిగిన ప్రత్యేక చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. భారత సాయుధ బలగాల సేవలు, త్యాగాలను ప్రశంసించారు. జాతీయ భద్రతపై చెక్కుచెదరని వారి సంకల్పాన్ని కొనియాడారు.
పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక. భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని సూటిగా ప్రశ్నించారు. పర్యాటకుల భద్రత కేంద్ర ప్రభుత్వానిది కాదా? అంటూ నిలదీశారు. ఇది నిఘా సంస్థల వైఫల్యం కాదా? అని ధ్వజమెత్తారు.
బాధ్యత ఎవరిది?
పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిది? ప్రధాన మంత్రిదా? హోం మంత్రిదా? రక్షణ మంత్రిదా? నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్‌దా? ఎవరైనా రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. జాతీయ భద్రత విషయంలో తీవ్రలోపం జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని అమిత్‌షా చెబుతున్నారని, అయితే కశ్మీర్‌లో గతంలోనూ టీఎఆర్ఎఫ్ దాడులు చేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎఫ్ వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందన్నారు. రక్షణమంత్రి గంటసేపు సభలో చాలా విషయాలు మాట్లాడారని, కానీ ఒక పాయింట్ ప్రస్తావించలేదన్నారు. ఏప్రిల్ 12న పట్టపగలే ఉగ్రదాడి ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేదన్నారు.
అమ్మ కన్నీరు పెట్టింది
2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టులను చంపినందుకు సోనియా గాంధీ కంటతడిపెట్టారంటూ హోంమంత్రి అమిత్‌షా ఆరోపించడాన్ని ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. తన కుటుంబం కూడా వ్యక్తిగతంగా నష్టపోయిందన్నారు. ఉగ్రవాదుల చేతిలో తన తండ్రి ప్రాణాలు కోల్పోయినప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.