రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం 505 పరుగులతో ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ ఖాతాలో మరో రికార్డ్ చేరనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డు ఆటగాళ్ల నైపుణ్యం, నిలకడ, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. విరాట్ కోహ్లీ ఈ గౌరవాన్ని రెండుసార్లు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2016, 2024 సీజన్‌లలో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న కోహ్లీ, 2025లో 505 పరుగులతో మరోసారి ఈ అవార్డును దక్కించుకునే ఛాన్సుంది. విరాట్ ఇదే అత్యధిక పరుగుల ట్రెండ్ కొనసాగిస్తే, మూడోసారి ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకోనున్నాడు.
కోహ్లీ రికార్డు స్థాయి ప్రదర్శన
2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతో 973 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో 4 సెంచరీలు, 7 అర్ధ శతకాలు చేశాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటికీ కోహ్లీ పేరిటే ఉంది. ఈ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ, ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు, అయితే టైటిల్ మాత్రం చేజారింది.