రష్యాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఈ సాయంత్రం లేదా రాత్రికి భారీ సునామీ సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ సముద్రంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతం అంతా కెరటాలకు కొట్టుపోతున్నాయి. ఒడ్డున ఉన్న పడవలు, బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఇక ఓడ రేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జపాన్‌తో పాటు అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. భారీ లౌడ్ స్పీకర్ల ద్వారా సునామీ సైరన్లు వినిపించాయి. పర్యాటకులు, స్థానికులు స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా ప్రజలంతా బయల్దేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫొటోల కోసం తీరానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అలలు పెద్దసంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది. జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక చైనాకు ముప్పు పొంచి ఉంది. షాంఘైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి.అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. రష్యా, హవాయి, ఈక్వెడార్ వరకు కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. భూకంపం 19.3 కి.మీ (12 మైళ్ళు) లోతులో ఏర్పడింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి కేంద్రీకృతమై ఉందని అమెరికా తెలిపింది. ఇక రష్యాతో పాటు అమెరికా, జపాన్‌లకు సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. అలాస్కాతో సహా అనేక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ప్రకంపనలకు భవనాలు కంపించాయి.