పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది చనిపోయిన ఘటనపై ప్రతీకారం కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తున్న భారత్.. ఇప్పుడు నేరుగా ప్రతీకార దాడికి సిద్దమవుతోంది. ఇందులో భాగంగా దేశ పౌరుల్ని సన్నద్ధం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ తమపై ఎప్పుడు దాడి చేయబోతోందో పక్కాగా వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ తమపై ఈ నెల 10, 11 తేదీల్లో ప్రతీకార దాడి చేయబోతోందంటూ ఇవాళ ట్వీట్ చేశారు. మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ ఉందని, దాని తర్వాత అంటే 10, 11 తేదీల్లో పాకిస్తాన్ పై భారత్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్ కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రపంచ నాయకులకు ఆహ్వానాలు కూడా అందాయి. రష్యా విక్టరీ డే పరేడ్ కు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందు భావించారు. కానీ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ద సన్నాహకాల్లో బిజీగా ఉండటంతో ఈ వేడుకకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతదేశం, రష్యా రెండింటికీ పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్.. రష్యా పరేడ్ తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై సైనిక దాడులు నిర్వహించవచ్చని ఊహిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలువురు రాజకీయ నేతలు భారత్ తమపై దాడి చేయబోతోందంటూ పక్కా నిఘా సమాచారం ఉందని పలుమార్లు వెల్లడించారు. అలాగే దాడి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పేశారు. కానీ వారు ఊహించినట్లుగా భారత్ మాత్రం ఆయా తేదీల్లో పాకిస్తాన్ పై దాడి చేయలేదు. అయినా ఇప్పుడు పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ ఇలా మరోసారి జోస్యం చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే భారత్ దాడి చేయడం పక్కా అని మాత్రం పాకిస్తాన్ లో మెజార్టీ జనం భావిస్తున్నారు.