ముంబై ఈ.డి .కార్యాలయం : ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారు జామున రెండుసార్లు ఈ భవనంలో మంటలు చెలరేగాయి. పలు కీలక ఫైళ్లు మంటలకు అహూతి అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేస్తోన్నారు. అగ్ని కీలలను అదుపు చేయడానికి నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఏమేం ఫైళ్లు మంటల బారిన పడ్డాయనే విషయంపై ఈడీ అధికారులు ఆరా తీస్తోన్నారు.
ముంబై బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని కరీం భాయ్ రోడ్‌లో గల ఖైసర్-ఐ-హింద్ బిల్డింగ్‌లో ఉందీ ఈడీ కార్యాలయం. ఈ తెల్లవారు జామున 2 30 గంటల సమయంలో ఇక్కడ మంటలు చెలరేగాయి. దట్టంగా పొక అలముకుంది. దీన్ని పసిగట్టిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక, పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లెవెల్ 2గా ప్రకటించారు. అదనపు సిబ్బందిని పిలిపించి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. మళ్లీ 4:21 నిమిషాలకు లెవెల్- 3 అప్‌డేట్ చేశారు. ఉదయం 7:30 గంటల వరకూ మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. పైఅంతస్తు నుంచి ఇంకా దట్టమైన పొగ వెలువడటం కనిపించింది. సమాచారం అందిన తరువాత ఈడీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తోన్నారు.